అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ.
వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను
చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ
కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
కులము లోన నొకడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
కులములోన నొకఁడు గుణహీనుఁడుండిన
కులము చెడును కాని గుణము వలన
వెలయు జెఱకునందు వెన్ను వెడలి నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.
విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుండు గాడు
కొలని హంసలకడ గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినురవేమ!
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
సాంచీ స్థూపం
మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
మేడిపండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు
బిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వ దాభిరామ! వినుర వేమ!
నిండునదులు పారు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ! వినుర వేమ!
అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ
దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు
అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా
విశ్వదాభిరామ! వినుర వేమ!
అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వ దాభిరామ! వినుర వేమ!
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ALSO READ
అల్పజాతి వాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!
కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు
విద్యచేత విఱ్ఱవీగువాఁడు
పసిడి గలుగువాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ! వినుర వేమ!
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
కులము లేని వాడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము దిగును
కులముకన్న భువిని కలిమి ఎక్కువ సుమీ
విశ్వదాభిరామ! వినుర వేమ!
అన్నిదానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లికంటె ఘనములేదు
ఎన్న గురునికన్న నెక్కుడులేదయా
విశ్వదాభిరామ! వినురవేమ!
నిక్క మైన మంచినీల మొక్కటి చాల
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటుపద్యములను చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!
ఈ పేజీలు కూడా చదవండి
ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా
విశ్వదాభిరామ! వినురవేమ!
ఉప్పులేనికూర హీనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
యప్పులేనివాడె యధిక సంపన్నుండు
విశ్వదాభిరామ! వినురవేమ!